లక్ష్మీ కళ్యాణం ద్విపద
పాలమున్నీటిలో,పడవంపు లతగ,పసి వెన్న ముద్దగా,ప్రభవంబు నొంది,కలుములు వెదజల్లు,కలికి చూపులకు,మరులంది మధువుకై,మచ్చిక లట్లు,ముక్కోటి వేల్పులు,ముసురుకొనంగ,తలపులో చర్చించి,తగ నిరసించి,అఖిల లోకాధారు-నిగమ సంచారు,నతజనమందారు,నందకుమారు,వలచి వరించిన వరలక్ష్మి గాథ,సకల పాపహరంబు,సంపత్కరంబు,ఘనమందారాద్రిని కవ్వంబుగాను,వాసుకి త్రాడుగా వరలంగ చేసి,అమృతంబు కాంక్షించి అసురులు సురలు,చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము,పరమ పావనమైన బారసినాడు,మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప,ఒయ్యారముల లప్ప ఒప్పులకుప్ప,చిన్నారి పొన్నారి శ్రీమహాదేవి,అష్టదళాబ్జమందావిర్భవించె,నింగిని తాకెడు నిద్దంపుటలలు,తూగుటుయ్యాలలై తుంపెసలార,బాల తా నటుతూగ పద్మమ్ముఛాయ,కన్నె తా నిటుతూగ కలువపూఛాయ,అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద,వీక్షించు చుండగా వెదురుమోసట్లు,పెరిగి పెండిలియీడు పిల్లయ్యెనంత,కల్పదృమంబున కళికలం బోలి,తనువున పులకలు దట్టమై నిగుడ,బార జాచి ప్రమోద భాష్పముల్ రాల,రావమ్మ భాగ్యాల రాశి రావమ్మా,రావమ్మ ఇందిరారమణి రావమ్మా,లోక శోకము బాపు లోలాక్షి వీవు,నాకు కూతురు వౌట నాపుణ్యమమ్మ,అంచు మురిసిపోయి అంబుధిస్వామి,ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం బంటె,సఖియను మంగళ స్నాన మాడింప,వాసవుండర్పించె వజ్రపీఠమ్ము,పూతనదీజల పూర్ణపుణ్యాహ,కలశాలతోడ దిగ్గజము లవ్వేళ,జలజాతగంధికి జలకమ్ము లార్చె,బంగారు సరిగంచు పట్టుపుట్టమ్ము,కట్టంగ సుతకిచ్చె కలశవారాశి,వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు,రాజీవ ముఖులైన రంభాదు లంత,కురులు నున్నగ దువ్వి,కుప్పెలు పెట్టి,కీల్జడ సవరించి కింజల్కధూళి,చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి,కళల పుట్టినయిండ్లు కన్నులకు,కమ్మని కవ్రంపు కాటుక దిద్ది,వెన్నెలతేటయౌ వెడదమోమునకు,గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి,అత్తరు జవ్వాజి అగరు చందనము,హత్తించి,తనువెల్ల ఆమె ముందటను,నిలువుటద్దంబును నిలిపి రంతటను,తన రూపు శ్రీలక్ష్మి దర్పణ మ్మందు,కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి,సింహాసనము డిగ్గి చెంగల్వదండ,చేదాల్చి యచ్చరల్ చేరి కొల్వంగ,కుచ్చెళ్ళు మీగాళ్ళ గునిసియాడంగ,గరుడు గంధర్వ రాక్షస యక్ష దివిజ సంఘ మధ్యమునకు సరగౌన వచ్చె,చెప్ప చోద్యం బైన శృంగారవల్లి,మొలకనవ్వుల ముద్దుమోమును జూచి,సోగకన్నుల వాలుచూపులు చూచి,ముదురు సంపెంగ మొగ్గ ముక్కును జూచి,అమృతంబు దొలకెడు అధరంబు చూచి,సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి,ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి,పాలిండ్ల జారు పయ్యెద చూచి,జవజవమను కౌసుసారును చూచి,గుండ్రని పిరుదుల కుదిరిక చూచి,కమనీయ కలహంస గమనంబు చూచి,మొగమున కందమౌ మొటిమను జూచి,మధుసూదనుడు దక్క మగవారలెల్ల,వలపు నిక్కాకకు వశవర్తులైరి,కన్నుల కెగదన్ను కైపున తన్ను,తిలకించు చున్నట్టి దిక్పాలకాది,సురవర్గమును గాంచి సుదతి భావించె,ఒక డంటరానివా డొకడు జారుండు,ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి,ఒకడు తిరిపిగా ఒకడు చంచలుడు,కాయకంటి ఒకండు,కటికవాడొకడు,ఒక్కటి తఱకైన ఒక్కటి తాలు,ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు,శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు,పుండరీకాక్షుండు భువనమోహనుడు,శంఖ చక్రధరుండు,శారఙ్గహస్తుండు,తప్త చామీకర ధగధగ ద్ధగిత పీతాంబరధరుండు,ప్రియ దర్శనుండు,మణిపుంజ రంజిత మంజుల మకుట,మకర కుండల హార మంజీర కటక,కాంచికా కేయూర క్రమభూషణుడు,అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్య మార్ధ వౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య,కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవుండు,విశ్వమంతయు తానైనవాడు,శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు,పతియైన సుఖములు పడయంగ వచ్చు,తులలేని భోగాల తులదూగ వచ్చు,ఏడేడు లోకాల నేలంగ వచ్చు,అంచు శౌరికి వైచె అలమేలు మంగ,చెంగల్వ విరిదండ చిత్తముప్పొంగ,సకల జగంబులు జయవెట్టు చుండ,శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు,తలయంటి పన్నీట తాన మాడించి,తడియొత్తి వేణుపత్రములంత చేసి,నామంబులను దిద్ది నవభూషణముల గైసేయ దివిజవర్గముల గొలువ,కదలనై రావణగజముపై స్వామి,కేశవా యంచును కీరముల్ పలుక,నారాయణాయంచు నెమళుల్ పలుక,మాధవాయంచును మధుపముల్ పలుక,గోవింద యనుచును కోయిలల్ పలుక,తయితక్క ధిమితక్క తద్ధిమిత కిట ఝణుత తకఝణుత ఝణుత యటంచు,అచ్చర విరిబోణు లాడి పాడంగ,ముత్తైదువులు సేస ముత్యాలు చల్ల,చల్లగా వేంచేయు జలదవర్ణునకు,అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష,వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టె,అదెవచ్చె ఇదెవచ్చె అల్లుడటంచు,మామగారెదురేగి మధుపర్కమిచ్చె పందిటి లోనికి పట్టి తోడ్తెచ్చె,పుణ్య తీర్థంబులు ప్రోక్షించి ఋషులు,మంగళాశాసన మంగళమ్మిడగ,కమలచేతికి చక్రి కట్టె కంకణము,దివ్య శంఖంబులు తిరుచిన్నములును,వేణు మర్దల రుద్రవీణలు మొరయ,తలవంచి కూర్చున్న తన్వి కంఠమున,మధువైరి గీలించె మాంగళ్యమపుడు,చేతుల తలబ్రాలు చేకొని గూడ,పోయగా వెనుకాడు పువుబోణి ముందు,శిరమువంచిన యట్టి శ్రీధరుజూచి,పకపక నవ్విరి పల్లవాధరులు,పదునాల్గు భువనముల్ పాలించు నట్టి,చల్లని విభునకు జయమంగళంబు,పదము మోపిన చోట పసిడి పండించు,చూడికుత్తుకకు శుభమంగళంబు,అంచు హారతు లెత్త నంగనామణులు,సాగె బువ్వముబంతి సంతోషముగను,కలిత కంకణఝణాత్కారమ్ము లెసగ,కటకలంఘలాఘలాత్కారముల్ పొసగ,పిరుదులపై వేణి పింపిళ్ళు గూయ,మొగమున తిలకంబు ముక్కున జార,చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము,ఘుమ ఘుమ వాసనల్ గ్రుమ్మరింపంగ,చురుకు జూపుల కోపు చూపఱ గుండె,వలపు చిచ్చు రగుల్ప వగలాడి యొకతె,కోడిగ మ్మాడెను గోపాలు నిట్లు,మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా,మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా,మచ్చుమందులు చల్లి మది దోచుకున్న,కరివాని నెవ్వారు కామింతురమ్మా,సుకియలు పోళీలు సొగియవు గాని,పురపుర మట్టిని బొక్కెడు నంట,పట్టె మంచము వేసి పాన్పమరింప,పాముపై తాబోయి పవళించు నంట,అంబారియేనుగే అవతల కంపి,గద్ద మీద వయాళి గదలెడు నంట,వింతవేషములెన్నో వేసెడు నంటరాసిక్య మిటులుంచి,రంగటు లుంచి,ఆకారసౌన్దర్యము అరయుద మ్మన్న,కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము,తామరకలిమికి స్థానమ్ము సుమ్ము,ఈ యంటు మనబాల కెపుడంట కుండ,తామరసిరిగల ధన్యాత్మునకును,నలిచి నల్లేరుతో నలుగిడ వలెను,కంద నీటను ఒడల్ గడుగంగ వలెను,గంధక లేపమ్ము కడుబూయ వలెను,వాడవాడల ద్రిప్పి వదలంగ వలెను,ఆ మాటలాలించి హరుపట్టమహిషి,మాధవుచెలియ ఆ బడతి కిట్లాడె,అతి విస్తారంబేల అందాలచిలుక,నీవు నేర్చిన తెన్గు నేర్తురే యొరులు,వెన్నుని నలుపంచు వెక్కిరించితివి,నెలతుక ఎరుపంచు నిక్కు చూపితివి,కలువపూవు నలుపు కస్తూరి నలుపు,కందిరీగ ఎరుపు కాకి నోరెరుపు,ఈ రెండు రంగులందే రంగు మెఱుగో,సొడ్డు వేయుట గాదు సూటిగా జెప్పు,వరుని జూచిన కంట వధువును జూడు,మాయ మర్మము వీడి మరి బదులాడు,కలికి కాల్సేతులు కన్నులు మోము,తామర విరిసిన తావులు గావో,తామరలో బుట్టి తామర బెరుగు,కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో,కందనీటి చికిత్స గారవించెదవో,ఇంతింత కన్నుల నెగదిజూచి,సిగ్గుతో నెమ్మోము చేత గప్పికొని,అనలుకొనలు వేయు అనురక్తితోడ,రసికత లేని మా రంగని మెడను,పూలమాలను వేసి పొలుపుగా నతని,గుండెలపై జేరి కులుకంగ దలచు,రంగనాయకి ఎంత రసికురాలమ్మ,శఫరలోచన యెంత చపలురాలమ్మ,ఆ నవ్వు లీనవ్వు లరవిరిమల్లె,అందాలు చిందుచు అలరింప మదులు,సకల వైభవముల జరిగెను పెండ్లి,అంపకమ్ముల వేళ అరుదెంచినంత,పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ,తాంబూల మొడి దాల్చి తరళాక్షి లక్ష్మి,తలపు లోపల కృంగు తండ్రిని జేరి,నాయనా యని పిల్చి నవదుఃఖ భాష్ప,కణములు జలజల కన్నుల రాల,గుండెపై తలవాల్చి కుములు చుండంగ,కడివెడు బడబాగ్ని కడుపులో నణచి,శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి,పాలపూసలతల్లి భాగ్యాలవెల్లి,వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మ,ఆడపిల్లలకు తండ్రి అయ్యెడు కంటే,మతి గతి లేనట్టి మౌనాలు మేలు,వీనుల నీపాట వినిపించు చుండ,కన్నుల నీ ఆట కనిపించు చుండ,ఊరటతో నెట్టులుందునే యమ్మ,గడియలో నిను వచ్చి కనకుందు నమ్మ,అని సాగరుడు పుత్రి ననునయింపగ బుద్ధులు గరపిరి పుణ్యకామినులు,ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో,వేదాంత వేద్యుడు విభుడాయె నీకు,ఆముదాలన్నియు ఆణిముత్యములె,చిగురు బోండ్లందరు సింధుకన్యకలె,తల్లి నీవెరుగని ధర్మముల్ గలవే,నెలత నీ వెరుగని నీతులున్నవియే,పదుగురు నడచిన బాటయే బాట,మందికి నచ్చిన మాటయే మాట,మంచిని విత్తిన మంచి ఫలించు,జొన్నలు విత్తిన చోళ్ళేల పండు,పోయి రాగదమ్మ పుత్తడిబొమ్మ,నీదు పుట్టింటిపై నెనరుంప రమ్మ,కని పెంచకున్నను కళ్యాణి,నిన్నులు కనులు చూడక ప్రొద్దు గడుచునే మాకు,చిలుకలు పల్కిన చివురుమావిళ్ళ,కోయిలల్ కూసిన గుండెలెట్లాడు,పొగడ చెట్లకు వ్రేలు పూదోట్ల గన్న,నిమ్మళంబుగ నెట్లు నిలుతుమె కన్న,కాటుకకాయను కాంత నేనిత్తు,కుంకుమ భరిణిని కొమ్మ నేనిత్తు,జోడుసెమ్మెలు నీకు జోటి నేనిత్తు,పట్టిన దంతయు బంగారు కాగ,ముట్టిన దెల్లయు ముత్యంబు కాగ,కడుపుసారెకు వేగ కదలి రావమ్మ,మదిలోన మమ్ముల మరచిపోకమ్మ,అంత మహాలక్ష్మి యనుగు నెచ్చెలుల,చెక్కులు ముద్దాడి చిబుకంబు లంటి,కంఠంబు నిండిన కన్నీళ్ళు నాపి బంగారు చెలులారా!ప్రాణంబులారా!,నేనయి మీరెల్ల నెగడి మాయింట,అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ,పట్టుకుచ్చులు నావి పరికీణీల్ నావి,పందిట తూగాడు పయిటలు నావి,కాళ్ళగజ్జెలు నావి,కడియాలు నావి,స్వేచ్ఛగా మీరెల్ల చేకొన్రమ్మ,అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ,అని బుజ్జగములాడి యందలంబెక్కి,కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి,కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు,కండచెక్కెర పాలు కలసియున్నట్లు,అంజనాచల వాసు దలమేలుమంగ,జంటవాయక సుఖ సంతోష లీల,సాధు రక్షణమును సలుపుచున్నారు,సాధు రక్షణమును సలుపుచున్నారు.
అఱుగని మంగళసూత్రము చెరగని కుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఱుగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.