శ్రీశివమానస పూజ ద్విపద

ధ్యానం
శ్రీపార్వతీనాధ చిన్మయబోధ!తాపసమందార ధర్మసంచార!
దక్షయాగవిభంగ ధవళభస్మాంగ!పక్షివాహనబాణ పన్నగాభరణ!
బాహుసక్తకరోట బాలేందుజూట!మోహనాకార సన్మునిచిత్తచోర!
సాగరతూణీర జగదేకశూర!నాగచర్మాంబర నయవచోమధుర!
పర్వతకోదండ పరిభృతాబాండ!సర్వలోకశరణ్య సజ్జనగణ్య!
దీనజనాధీన దినకరనయన!సునాస్త్రభంగ వసుమతీశతాంగ!
జయ నీలకంఠ సజ్జనభవోల్లుంఠ!జయ శంకరాహర జయమేరుధీర!
యిటు నిన్ దలంచుచు నెల్లకాలంబు పటుతరధ్యానంబు బరగగాజేసి,

ఆవాహనం
ముక్కంటిదయలేక ముక్తిలేదెందు నిక్కమింతనిపల్కు నిగమముల్ గాంచి
పూజ నీకైసేయ బూనితినయ్య రాజశేఖరవేగ రాబూనవయ్య
యిదియె యావాహనం బీశ్వర నీకు

ఆసనం
సదమలగుణమణి స్థాపితంబగుచు కదలకనుండు నా హృదయపీఠమున
ముదమంద గౌరితో గదిసికూర్చుండు

పాద్యం
నీరూపుమదిలోన నిల్పుట ్‌గల్గు వైరాగ్యసుఖముచే వరదలై జెలగు
కన్నీరు మీపాదకమలముల్ గడుగ నెన్నికగలపాద్య మిచ్చితివేగ

అర్ఘ్యం
అన్నలుదమ్ములు నాలుపిల్లలను వన్నెసొమ్ములుమంచి వాహనంబులను
జెందకనీయందె జిల్కుచునుండు నందంపు బ్రేమరసాంబువుల్ నీకు
పరిమళార్ఘ్యంబులు పరశివనామ!

ఆచమనం
మరిగిలోచూపును మరచిబాహ్యంబు వదలివాసనలెల్ల పరమసమాధి
పదముజెంది మనంబు బడియున్నవేళ బొంగినయానంద బోధరసంబు
లంగజవైరి మీ కాచమనంబు

స్నానం
ఆనందమయుడైన హరుడెసర్వంబు నానాత్వమతనికి లేనెలేదెపుడు
గావున శివుడె యీ కనుపడువిశ్వ మీవిధిదృఢముగా నెల్లశాస్త్రములు
బలుకుచున్నవటంచు దెలుపు సద్గురుని లలితవాక్యామృత లహరిలోముంచి
తెచ్చినవిజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడమీకు స్నానోదకంబు

వస్త్రం
గిరిచాప మాయయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులిబట్టి త్రుంచి
వాటిచర్మంబులు వలిచి నీవల్లె వాటుకొక్కటి యంగవస్త్రార్థ మొకటి
ఇచ్చితిగొనుమయ్య హేరంబజనక!

భస్మం
హెచ్చెడికోరికె లిపురంటగాల్చి మోహపాశంబుల మొదలంటగాల్చి
దేహవాసనలెల్ల తెగ వ్రేసిగాల్చి యాసలుగుంపుల నడుగంటగాల్చి
దోసాలమూకల ద్రుంచుచుగాల్చి భస్మమర్పించితి పరమేశనీకు

యజ్ఞోపవీతం
ఇసుమంతయైనను విసువకలోని వాతసంచారముల్ వరుసగాదెలిసి
చేతులుదొడలపై జెలువందనిల్పి కుంభకంబునలోని కుండలినిబట్టి
కుంభించిమీదికి గొనిచక్కజేసి జందె మర్పించితి సర్వలోకేశ!

గంధం
సందియంబులుమాని సమదృష్టిజూడ జగము నీవేగదా నిగమగంధర్వ
నగవాస యిది లెస్స నమ్ముటం గల్గు చిత్తవిశ్రాంతియన్ శీతలగంధ
మిత్తరి నొసగితి నిహపర సుఖద!

అక్షతలు
నాసాగ్రమున చూపు నాటియున్నపుడు భాసితంబగులోని బయలులో తెల్ల
బియ్యంబువలెదోచు పెనువెల్గు కళల నయ్య నీ కక్షత లర్పించినాడ

కిరీటాదులు
మౌనమే నీకొక్క మణికిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు
కపటంబులేమియే కంకణాల్ నీకు కుపితత్వ రహితమే కొలికిమొల్తాడు
నిందలమానుటే యందెలు నీకు నిందుశేఖర!సొమ్ము లిచ్చితినిట్లు

పుష్పములు
లింగంబుపై చూపు లీనమైనపుడు రంగురంగులచే జెలంగెడిలోని
వెలుగుపువ్వులరీతి వెలయుచుండగను కలిపి వానిని వెలిగల పూలతోడ
నిటుల పూజించుట కిచ్ఛయించితిని పటుదయతో గొను భ్రామరీలోల!
గన్నెర్లపూజింతు గనకాద్రిచాపు పొన్నలపూజింతు బుధజనాలాపు

మల్లెలపూజింతు మల్లికార్జునుని మొల్లల పూజింతు మునిబృందనుతుని
యరవిందములచేత నంబికాధవుని సురపొన్నపూలచే సూర్యలోచనుని
నందివర్థనముల నందివాహనుని యిందీవరంబుల నిభచర్మపటుని
ఫాలాక్షునర్చింతు పారిజాతముల శూలాంకు నర్చింతు సూర్యపుష్పముల

గోవాహు నర్చింతు గోరంటపూల శ్రీ విశ్వనాధుని చరబిల్వములను
దుర్గేశు నర్చింతు తుమ్మిపువ్వులను భర్గుని పూజింతు పాటలంబులను
గిరిజేశు నర్చింతు గిరిమల్లెపూల కరకంఠునర్చింతు కురువకంబులను
గోకర్ణవాసుని కొండగోగులను శ్రీకంఠు నర్చింతు చెంగల్వపూల

శంకరుపూజింతు జాజిపువ్వులను శాంకరీలోలుని శతపత్రములను
మలహరు పూజింతు మాలతిపూల కలికల్మషాపహున్ కనకాంబరముల
భీమరూపుని లేత బిల్వపత్రముల కామసంహారుని కాశిరత్నముల
శశిధరు నర్చింతు చంపకంబులను పశుపతి బూజింతు వకుళపుష్పముల

శర్వుని పూజింతు సంపెంగపూల సర్వేశుబూజింతు సర్వపుష్పముల
నిన్ని పువ్వులబూజలింపొందజేసి

ధూపము
యన్నివాసనలకు నాధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్వహ్నిలోన
హత్తించి బుద్ధియన్ హస్తాన విసరి ధూపమర్పించితి ధూర్జటామకుట!

దీపము
ఆపత్పరంపర కాలయంబగుచు దనరు ముప్పదియారు తత్వముల్ వత్తి
గనుజేసి గురుబోధయను దీపశిఖను ముట్టించి యారతి బట్టితి నీకు

అమృతాన్నం
మట్టుమీరిన జ్ఞానమార్గంబులరసి మూడుదేహములందు మూడవస్థలను
మూడువిధముల భోగములుబొందువాడు నీకన్న లేడను నిశ్చయభావ
మేకాలమందున నెడజేయకునికి యమృతాన్నరసముగా నర్పించినాడ

తాంబూలం
సమబుద్ధివృత్తిని సాగనీనట్టి మూడుగుణమ్ముల ముడిచి తాంబూల
మోడకనిచ్చితి యోగీంద్రవినుత!

కర్పూరహారతి
నీవె నేననుబుద్ధి నిలుకడచేత భావంబు శుద్ధమై పండువెన్నెలల
బోలగదాని కర్పూరదీపముగ లీల నీకిచ్చితి కాలాగ్నిరుద్ర!

మంత్రపుష్పం
గురుడు చెప్పినబుద్ధి మరచిపోబోక మరగియుండుటెనీకు మంత్రపుష్పంబు

ఛత్రచామరాదులు
చపలతమానుటే ఛత్రంబు బుద్ధి విపరీతముడుగుటే వింజామరములు
ధర్మసంచారమే తాళవృంతంబు నిర్మలచిత్తమే నిలువుటద్దంబు
కల్లమాటలులేమి ఘంటారవంబు చల్లనిమాటలే శంఖారవంబు
సత్యంబుపలుకుటే సంగీతరవము నిత్యనీస్మరణయే నిఖిలవాద్యములు

న్యాయవిహారమే నాట్యముల్ నీకు కాయమే యాందోళికము సత్-క్రియాళి
జేయుటయే ప్రదక్షిణవందనములు పాయనిభక్తియే పరమసమాధి

స్తోత్రం
హర మిమ్మునిటుల నే నర్చించినాడ కరుణతో మెచ్చుము ఘనుడనీవాడ
నీపూజసేయగా నేరరు మునులు నీపూజసేయగా నేరరుసురలు
గావున నాబోటి ఖలుడు నీపూజ గావించునే కోటికమలాప్తతేజా!
జ్ఞానవిద్యాభ్యాసగతి నేనెరుంగ ధ్యానయోగంబుల దారినెరుంగ

సంపూర్ణబోధల జాడలనెరుగ నింపైన నీభక్తి పెంపులు నెరుగ
క్రోధచిత్తుండను కుటిలాత్మకుండ సాధుత్వహీనుండ చపలేంద్రియుండ
తిండిపోతునెకాని తెలివేమిలేదు దండపాపినెగాని దయ యేమి లేదు
భక్తిహీనులలోన బాగైనవాడ ముక్తిహీనులకెల్ల మొదలైనవాడ

హరశివశంభోమహాదేవ!యంచు హరసాంబశంభోమహాదేవ! యంచు
నీ రెండుమాటలనెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు
పెద్దలుచెప్పగా విని మది నమ్మి బుద్ధితెచ్చుకమిమ్ము పొడగంటిసుమ్మి
యెటుల నన్ బ్రోచెదో యింత పాపాత్ము యెటుల రక్షించెదో యింత దుష్టాత్ము

నాయన్ననాతండ్రి నన్నేలువాడ నాయయ్య నాదొర ననుగన్నవాడ
దీనపోషక సర్వదేవదేవేశ!దానవకులనాశ దాక్షాయణీశ!
కామబాధల నన్ను గలగానియకు కామారి ననుబాసి కదలగాబోకు
విషయముల్ ననుబట్టి వేధించనియకు విషమాక్ష!నీవు నన్విడిచిపోబోకు

దుర్గుణంబుల నన్ను దూలగానియకు దుర్గుణంబుల దుర్గేశ నన్ రోసి తొలుగగాబోకు
వాదభేదంబుల వదరుట రోసి ఖేదమోదంబుల గెల్చుటదెలిసి
కాసువీసాలపై కాంక్షలులేక భాసురాంగుల మోహపాశాలబడక
హృదయంబు నీరూపు యెడబాయకుండ వదనంబు నీపేరు వదలకనుండ
జేయు మితరంబులౌ సిద్ధులనొల్ల పాయనిపాపమౌ భాగ్యమేనొల్ల

తను పెంచుదొంగలౌ తనయులనొల్ల కొనితెచ్చుపీడలౌ కొంపలనొల్ల
కల్లరిబొమ్మయౌ కాయంబునొల్ల పొల్లుగింజలబోలు భోగంబు లొల్ల
నద్దెకొంపలబోలు నాలోకమొల్ల సుద్దులింకేల యేసుద్దుల నొల్ల
నీవె నాభాగ్యంబు నీవెనాగతివి నీవెనాబంధుండ వీవెనాసుఖము-

ముక్కంటినీకన్న దిక్కేదిజగతి మ్రొక్కెద నీపాదములకు సర్వేశ
విన్నపంబొక్కటి వినుపింపదలచి యున్న నా మొరవిను మన్నపూర్ణేశ!
వెస నీదుభక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను బంటుగాజేయు
శాంభవదీక్షల స్థాపించినట్టి కుంభజాదుల సేవకుల గూర్చునన్ను

శైవయోగంబుల సవరించినట్టి రేవణాదుల శిష్యసేవలో నిల్పు
పలుమారు నీ పేరు బలికెడివారి కులములో ననుబుట్ట గూర్పుమాయయ్య!
నీచింతజేసెడి నిపుణుల నెపుడు జూచిదండముబెట్ట జొన్పుమునన్ను
పాటించి నీ పాట పాడెడివారి తోటిగూడగజేయు తుహినాద్రివాస!

చెలగుచు నీపూజ జేసెడివారి గలసియుండగజేయు గజచర్మచేల
విసువక నీకథల్ వినియెడివారి కొసరుచు గొనియాడగూర్పవేనన్ను
మాదిక్కు శివుడని వాదించువారి పాదాలమీద నంబడియుండజేయు
మిటు సేయకుంటివా యేన్నటికైన పటుతర సంసారపాశంబు దెగునె?

తాచుబామునుమెడ దగలించవచ్చు లేచుచుండెడికోర్కె లీడేరరాదు
పులినోటచెయి బెట్టి పొడువంగవచ్చు పలుదెచ్చుకోపంబు బడదొయ్యరాదు
దాహం బణచవచ్చు దగజెముడుబాల దేహమేననుబుద్ధి తెగవేయరాదు
ఇంగలంబులనైన మ్రింగగావచ్చు బంగారుపైయాస బాయంగరాదు

యెత్తిమొయ్యగవచ్చు నేనుంగనైన చిత్తంబుపరిశుద్ధి సేయంగరాదు
కొంకిముండ్లను పరచుకొని పండవచ్చు రంకుబుద్ధుల మానరా డెట్లనైన
యినుపకంబముగాల్చి యెద మోపవచ్చు తనవారిపై ప్రీతి తగ్గించరాదు
తప్పుడుకూతల దగవర్లవచ్చు తప్పక శివనిన్ను దలువంగరాదు

పాపకర్ములజూచి భ్రమజెందవచ్చు చూపునీపైనిల్పి సుఖియించరాదు
యేమైనజేయుట కెట్లైనవచ్చు నీమీద మనసును నిలుపంగరాదు
యెన్నటి కీదుఃఖ మీడేరు నాకు యెన్నటికీభయం బెడతేరునాకు
యెందరైరోతల్లు లెందరోతండ్రు లెందరోతనవార లెందరోసుతులు

మునుపెన్ని జన్మంబులను జెందినానొ కనజాలనయ్యయో గర్వినైపొంగి
యేదిక్కునమ్ముదు నేదారిబోదు నేదేశముననుండి యిటకువచ్చితినొ
యిటనుండిపోదు నేనేదేశమునకు కటకటాయిది దెల్పు ఘనుడెందుదొరుకు
యెందుకీభోగంబు లెందుకీమురుపు లెందుకీభాగ్యంబు లెందుకీయిండ్లు

ముందుచావుండంగ మురయంగనగునె?చిందులాడెడిబుద్ధి చిక్కు లెట్లోర్తు
నినుజెందెనోలేదొ నేజేయుపూజ నినుముట్టెనో లేదొ నేజేయుజపము
నీకు తెలిసెనొలేదొ నేజేయుభక్తి నీకు తెలిసెనొలేదొ నేదల్చుతలపు
బ్రతుకుశాశ్వతమని భ్రమసితిగాని మృతివెంటనేయున్న గతినేమిగాన

నిల్లు నాదియటంచు నెగసితిగాని వల్లకాటికి జేరవలయుటగాన
ధనము సౌఖ్యంబిచ్చు ననుకొంటిగాని పెనుచింతచే జంపునని తెలియగాన
మనవారుమనకౌదు రనుకొంటిగాని తన శరీరమెగాదు తనకంటగాన
నీవు జేసితొలేదొ యీవిశ్వమెల్ల నీవు జేసితొలేదొ యీ విచిత్రంబు

ఇల నీశరీరమం చెప్పుడువిందు జలధి నీ చెమటగా చాల నే విందు
నీగాలి నీప్రాణ మెల్లనివిందు నీగట్లు నీబొక్క లెల్లని విందు
నరములుగా విందు నదులెల్లనీకు కురులనుగావిందు నెరిమొగుల్ నీకు
కనులునీవనివిందు ననలాబ్జరవులు పనులునీవనివిందు ప్రాణికల్పనలు

అంతటనున్నాడు హరుడనివిందు అంతటికిన్ దిక్కు హరుడనివిందు
నేవింటికొందరు నిను జూచినట్లు నేవింటికొందరు నిను గూడినట్లు
నేవింటికొందరు నిను జేరినట్లు నేవింటికొందరు నీవైనయట్లు
నిజమౌనొకాదొయీ నేవిన్నదెల్ల నిజముగాకనెపోతె నేదిర్గినన్ని

దేశాలలో శివదేవాలయములు నాసతోగట్టంగ నరసితినింక
పంచాక్షరీజప పరులనుగంటి గాంచితినిన్ను భజించెడివారి
నికసంశయింతునా యెన్నటికైన నికనిన్నువిడుతునా యేదెట్లనైన
వ్యవహారమెందైన వ్యర్థమైపోని శివ నీదుభక్తిని సేయకమాన

చప్పట్లకొట్టని సాటివారెల్ల తప్పకశివనిన్ను దలపకమాన
పైవారు ననుజూచి పకపకనగిన శైవయోగంబుల సాధనమాన
తివిరిమావారెంత దిట్టినగాని శివనీదు పూజల సేయకమాన
దారిద్ర్యమేరాని ధనమైనరాని కోరికనీమీద గూర్చకమాన

యేదెట్లనేమైన నెవ్వరెట్లన్న సాదరంబుననీదు పాదముల్ విడువ
చూపునీపై నిల్పి సుఖియింపడేని లోపటబైట నీ దాపుగన్పడదు
మరచెనా నీచింత మనసెప్పుడైన తరిమి చింతలువాని దరిజేరనియవు
చెలగి నీభక్తుల జేరకనున్న కలనైన నీదారి కానంగరాదు

గురుడు చెప్పినరీతి మర్చెనావాని గురుతరమృత్యువు గూల్పకపోదు
యెపుడైన గురుమంత్ర మేమరియున్న కపటదారిద్ర్యంబు కాల్పకపోదు
ఆశ నీపై నుంచడాయనా యాత డాశలలోజిక్కి హతమయిపోవు
కావున నిదిదెల్సి కడుభయంబంది దేవరా నీవెనా దిక్కనియంటి

ననుకడతేర్చవే నందితురంగ ననుకరుణింపవే నాప్రాణలింగ
కన్నులునీకివ్వ కన్నప్పగాను నిన్నురోకటగట్ట నిమ్మవ్వగాను
కోరి పాల్ దాగించ కూచమ్మగాను పిండిని తినుపింప పిట్టవ్వగాను
చీర పుత్రునిజంప సిర్యాళుగాను బంటుగా నినుసేయ బాణుండగాను

కుంటెనజేయింప గురుకులున్ గాను తాండవంబాడించ చండికన్ గాను
ఒప్పెనోనాభక్తి తప్పెనో తెలియ తప్పులెంచకుమయ్య తండ్రివిగాన
శరణుసర్వేశ్వర!శరణుగిరీశ!శరణుజగద్రూప!శరణుపరేశ!
శరణుశాశ్వతనామ!శరణుచిద్ధామ!శరణు శంకరలింగ!శరణయ్య నీకు

కరచరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణనయనజంవా మానసంవా పరాధం
విహితమవిహితంవా సర్వమేతత్ క్షమస్వ!
శివశివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో!

ఓం తత్సత్