శ్రీరుక్మిణీ కళ్యాణ లేఖ

1. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక;
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల;
కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన;
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ;
దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
2. ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
3. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్
4. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
5. అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
6. ‘లోపలి సౌధంబులోన వర్తింపంగఁ;
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి;
కాని తేరా’ దని కమలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద;
నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ;
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
7. ఘను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు, ప్రాణేశ్వరా!
8. ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు.
9. నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!